హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రిన్సిపాల్ సూచించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగాచారి ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాల గురించి వివరించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద లింకులు, APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో వ్యక్తిగత వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని, సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హయత్నగర్ సీఐ జె. శంకరయ్య, ఎస్సై కె. వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్సై శివకుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా. ఇ. యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.