ఎగువ మానేరు ప్రాజెక్టులో పెరుగుతున్న నీటిమట్టం.. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

సిరిసిల్ల: ఎగువ మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె బుధవారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద ప్రస్తుత పరిస్థితిని అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహం, ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలపై నీటిపారుదల శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరాలు అందించారు. ప్రస్తుతం కూడవెల్లి, పాల్వంచ వాగుల నుంచి ప్రాజెక్టులోకి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదని తెలిపారు. ప్రాజెక్టులోకి వచ్చే నీటి ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

ఎగువ మానేరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 1.6 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగం సూచించింది.