పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బంగారి రమేష్ అధ్యక్షతన ‘జీపీడీపీ సంకల్ప్’ గ్రామసభ మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP)లో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సమగ్ర యాక్షన్ ప్లాన్‌పై సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన పలు అంశాలను ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
వర్షాకాలంలో గ్రామంలో తలెత్తే సమస్యల పరిష్కారం, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం, స్వచ్ఛత, ఆరోగ్యం వంటి అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ (SWM), విద్యా రంగానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు సేకరించారు.
ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ 16వ ఆర్థిక సంఘం (16th Finance) మార్గదర్శకాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. నిధులను గ్రామ అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకునే విధానం, చేపట్టాల్సిన పనులపై వివరించారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు.