మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన లైంగిక వేధింపులు, దాడి ఫిర్యాదు కేసులో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం తన స్వగ్రామం నుంచి హైదరాబాద్కు వస్తుండగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని దామరచర్ల వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. మరికొద్దిసేపట్లో ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
ఈ నెల 18న మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన రెండు రోజుల తర్వాత, ఈ నెల 20న ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు రోజుల పాటు చికిత్స పొందారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన కనిపించకుండా పోవడంతో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన తన స్వగ్రామంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు వస్తుండగా దామరచర్ల వద్ద అదుపులోకి తీసుకుని అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.