నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.60 కోట్ల వ్యయంతో 97 అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అలాగే 48 కిలోమీటర్ల మేర డ్రైన్ల నిర్మాణం కొనసాగుతోందని, ఎన్నికలు లేని సమయంలో కూడా పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని 1వ డివిజన్‌లోని కోడూరుపాడు కల్తీ కాలనీలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పార్టీ నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.