కోడిపందేలపై పోలీసుల దాడి.. 14 మంది అరెస్ట్, నగదు స్వాధీనం

తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కంచనపల్లి గ్రామ పరిధిలోని ఓ మామిడి తోటలో నిర్వహిస్తున్న కోడిపందేలపై బి.ఎన్. కండ్రిగ సర్కిల్ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. శ్రీకాళహస్తి డీఎస్పీ శ్రీ నరసింహమూర్తి పర్యవేక్షణలో, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే పలువురు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే 14 మందిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఈ దాడిలో 7 కోడిపందెం కోళ్లు, 40 మోటార్‌సైకిళ్లు, రూ.71,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.