యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న కొన్ని అనధికారిక కార్యకలాపాలపై ఆయన వ్యక్తిగత కార్యాలయం స్పందించింది. ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ‘RAW NTR’ అనే సంస్థకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఎన్టీఆర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ‘RAW NTR’ పేరుతో కొందరు వ్యక్తులు నిర్వహిస్తున్న కార్యకలాపాలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది. ఆ సంస్థకు గానీ, వారు చేపడుతున్న కార్యక్రమాలకు గానీ జూనియర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అలాగే ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదా ఆయన పేరును ఉపయోగించే అధికారం ఆ సంస్థకు లేదని వెల్లడించింది.
జూనియర్ ఎన్టీఆర్ చేపట్టే సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక సమాచారం ఆయన అధికారిక పీఆర్ టీమ్ ద్వారానే విడుదల అవుతుందని కార్యాలయం తెలిపింది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు చేసే ప్రచారాలు, ప్రకటనలను నమ్మవద్దని కోరుతూ, ఈ ప్రకటనతో ‘RAW NTR’కు సంబంధించిన అన్ని అపోహలు, వదంతులకు తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.