ప్రభుత్వ ఆసుపత్రులకు నాణ్యమైన వైద్య పరికరాలను వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రొక్యూర్‌మెంట్ (కొనుగోలు) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కోటిలోని టీజీఎంఎస్‌ఐడీసీ (TGMSIDC) కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వైద్య పరికరాల కొనుగోళ్లు, టెండర్ల ప్రక్రియ, పరికరాల పనితీరు, నిర్వహణ, కొత్త ఆసుపత్రులకు అవసరమైన సదుపాయాలపై ఆయన సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసే ప్రతి పరికరం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, భవిష్యత్తులో కొనుగోళ్లు ఒకే విధమైన ప్రామాణిక విధానంలో జరగాలని స్పష్టం చేశారు.
వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం, సామర్థ్యాన్ని పెంచేందుకు మొత్తం వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం ‘ఎండ్-టు-ఎండ్ డిజిటల్ టూల్’ను త్వరగా అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇండెంట్ నమోదు చేసిన దశ నుంచి ఆసుపత్రిలో పరికరం ఏర్పాటు చేసే వరకు ప్రతి ప్రక్రియను ఆన్‌లైన్‌లో సులభంగా పర్యవేక్షించే విధంగా వ్యవస్థను రూపొందించాలని తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వైద్య పరికరాలు ఎప్పటికప్పుడు పనిచేసేలా పర్యవేక్షించేందుకు ‘సెంట్రలైజ్డ్ డ్యాష్‌బోర్డ్’ను ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో సమీక్ష నిర్వహిస్తూ పరికరాల పనితీరు, నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.