‘జన నాయకగన్’ రిలీజ్‌పై సీఎం విజయ్ కఠిన నిర్ణయం.. బ్లాక్ టికెట్లపై ఉక్కుపాదం!

 

తమిళ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకగన్’ విడుదలపై ఆసక్తి నెలకొంది. సెన్సార్ ప్రక్రియ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే సినిమా విడుదల కంటే ముందు టికెట్ల విక్రయాలపై సీఎం విజయ్ కఠిన వైఖరి అవలంబించినట్లు సమాచారం.

తమిళ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, సినిమా విడుదల సమయంలో బ్లాక్ టికెట్ల విక్రయం లేదా అనుమతించిన ధరల కంటే ఎక్కువ ధరలకు టికెట్లు అమ్మితే రాజకీయ విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో టికెట్ ధరలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచనలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అనుమతించిన ధరల కంటే ఎక్కువకు టికెట్లు విక్రయించినట్లు తేలితే సంబంధిత థియేటర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేసే అవకాశముందని తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం లేదా విజయ్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ‘జన నాయకగన్’ విడుదలతో పాటు ఈ వార్తలపై కూడా ఆసక్తి నెలకొంది.