ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణతో టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఖర్చుల నియంత్రణ చర్యల్లో భాగంగా సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 2.1 శాతం మేర, అంటే సుమారు 4,800 మందిని విధుల నుంచి తొలగించనున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఏఐ రంగంలో వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అంచనాలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌తో పాటు అమెజాన్, మెటా, గూగుల్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఏఐపై దృష్టి సారిస్తూ సంప్రదాయ ఉద్యోగాల సంఖ్యను తగ్గిస్తున్నాయి.
మరోవైపు 2026 తొలి ఆరు నెలల్లో మైక్రోసాఫ్ట్ షేర్లు సుమారు 23 శాతం పడిపోవడంతో కంపెనీపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. 2022 తర్వాత ఇదే అత్యంత బలహీనమైన తొలి అర్ధవార్షిక ప్రదర్శనగా నమోదైంది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో వేలాది మంది ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించిన మైక్రోసాఫ్ట్, ఇప్పుడు తాజా లేఆఫ్స్ ప్రకటించడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.