పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ మోసం కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. భారత ప్రభుత్వ విజ్ఞప్తిపై బ్రిటన్ కోర్టుల్లో సాగిన న్యాయపోరాటంలో నీరవ్ మోదీకి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. తన అప్పగింతను నిలిపివేయాలని దాఖలు చేసిన అన్ని పిటిషన్లను యూకే న్యాయస్థానాలు తిరస్కరించాయి.
చివరి ప్రయత్నంగా నీరవ్ మోదీ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (ECHR)ను ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఉపశమనం లభించలేదు. దీంతో ఆయనను భారత్‌కు అప్పగించే ప్రక్రియను బ్రిటన్ ప్రభుత్వం వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత భారత అధికారులకు ఆయనను అప్పగించే అవకాశం ఉంది.
పీఎన్బీ రుణ మోసం, మనీలాండరింగ్ కేసుల్లో నీరవ్ మోదీపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. 2019 మార్చి నుంచి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్న నీరవ్ మోదీని భారత న్యాయస్థానాల ముందు హాజరుపర్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించే దశకు చేరుకున్నాయి.