అయోధ్య రామ మందిరంలో కానుకల దొంగతనం కలకలం.. ట్రస్ట్ కీలక నిర్ణయాలు

 

అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో కానుకల దొంగతనం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. దొంగతనం వివాదం నేపథ్యంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. అయితే చంపత్ రాయ్ ట్రస్టీగా కొనసాగనున్నట్లు సమాచారం.

ఈ ఘటన కోట్లాది మంది రామభక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ట్రస్ట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మాట్లాడుతూ, ఈ ఘటనలో బాధ్యులెవరైనా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగుతోందని, దర్యాప్తుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ట్రస్ట్ వెల్లడించింది. ఇదిలా ఉండగా, ప్రధాన కార్యదర్శి పదవికి విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజ్రంగ్ బగ్రా పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

మరోవైపు ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోనూ దుమారం రేపుతోంది. ఆలయ భద్రత, నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.