మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో తహశీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో గ్యాస్ సిలిండర్లను సకాలంలో సరఫరా చేయడం, బుకింగ్ చేసిన సిలిండర్లను నిర్ణీత సమయంలో పంపిణీ చేయడం, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడం, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించడం వంటి అంశాలపై చర్చించారు.
గ్యాస్ సిలిండర్ డెలివరీ అనంతరం వినియోగదారులకు వచ్చే ఐవీఆర్ఎస్ (IVRS) కాల్స్‌కు తప్పనిసరిగా స్పందించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులు గ్యాస్ ఏజెన్సీలకు సూచించారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ సేవల నాణ్యతను మెరుగుపరచడంలో కీలకమని, డెలివరీ సిబ్బంది కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ ప్రాధాన్యాన్ని వినియోగదారులకు వివరించాలని తెలిపారు. అలాగే ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తూ ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశించారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని, ఐవీఆర్ఎస్ కాల్స్‌పై వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తామని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి అంకయ్య, గిద్దలూరు తహశీల్దార్ ఎం. ఆంజనేయ రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్లు సూర రామనారాయణ రెడ్డి, సాలమ్మతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.