భారత్లో బంగారం అనేది కేవలం విలువైన లోహం మాత్రమే కాదు. కుటుంబాల ఆర్థిక భద్రత, సంప్రదాయం, వారసత్వానికి ప్రతీకగా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడుల రూపంలో బంగారం కొనుగోలు చేయడం భారతీయులలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆనవాయితీ. అయితే ఇదే అలవాటు దేశ ఆర్థిక వ్యవస్థపై మరో కోణంలో ఒత్తిడిని పెంచుతోంది.
భారతదేశంలో వినియోగించే బంగారంలో అధిక శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. ప్రతి ఏడాది బిలియన్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించి బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నప్పటికీ, అందులో ఎక్కువ భాగం ఇళ్లలో, బ్యాంకు లాకర్లలో, దేవాలయాల్లో వినియోగం లేకుండా నిల్వగా మిగిలిపోతోంది. ఉత్పాదక రంగాల్లోకి ప్రవేశించకుండా ఈ బంగారం స్థిర ఆస్తిగా ఉండిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష ప్రయోజనం కలగడం లేదు.
ఒకవైపు దేశంలో ఇప్పటికే భారీగా బంగారం నిల్వలు ఉన్నప్పటికీ, మరోవైపు ప్రతి ఏడాది కొత్తగా బంగారం దిగుమతుల కోసం విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో వాణిజ్య లోటు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇళ్లలో నిరుపయోగంగా నిల్వ ఉన్న బంగారాన్ని ఉత్పాదక ఆర్థిక కార్యకలాపాల్లోకి తీసుకురాగలిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.