టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుతో కలిసి సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ & రీసెర్చ్ సెంటర్ను సందర్శించారు. ఆస్పత్రిలో చిన్నారులకు అందుతున్న ఉచిత గుండె వైద్య సేవలు, వైద్య సదుపాయాలను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ.. హరీశ్ రావు ప్రజాసేవను ప్రశంసిస్తూ, ఆయనను “సిద్దిపేట కా షేర్” అని అభివర్ణించారు. పేద కుటుంబాల పిల్లలకు అత్యాధునిక గుండె వైద్య సేవలు ఉచితంగా అందించేలా ఈ ఆస్పత్రి ఏర్పాటుకు హరీశ్ రావు చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో భారీ ఖర్చుతో లభించే చికిత్సను ఇక్కడ ఉచితంగా అందించడం వల్ల ఎంతోమంది చిన్నారులు కొత్త జీవితాన్ని పొందుతున్నారని విజయ్ అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.