థాయ్‌లాండ్ ప్రయాణ నిబంధనలు మారాయి.. భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు

 

థాయ్‌లాండ్‌కు వెళ్లే భారతీయ ప్రయాణికులకు బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. కొత్త ప్రయాణ నిబంధనల ప్రకారం.. పాస్‌పోర్ట్‌కు కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉండాలి. అలాగే తిరుగు ప్రయాణ టికెట్, హోటల్ బుకింగ్ వివరాలు తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి. థాయ్‌లాండ్ చేరుకునే 72 గంటల ముందే ఆన్‌లైన్‌లో థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ పూర్తి చేసి, అందులో వచ్చే క్యూ ఆర్ కోడ్‌ను ఇమ్మిగ్రేషన్ తనిఖీల కోసం వెంట ఉంచుకోవాలని సూచించింది.

వీసా ఆన్ అరైవల్ లేదా వీసా మినహాయింపు ద్వారా వెళ్లే ప్రయాణికులు కనీసం 20,000 థాయ్ బాట్ (సుమారు రూ.58 వేల విలువ) నగదు లేదా అందుకు సమానమైన ఆర్థిక వనరులు ఉన్నట్లు చూపించాల్సి రావొచ్చని పేర్కొంది. ఉద్యోగం కోసం వెళ్లేవారు పర్యాటక వీసాతో కాకుండా సంబంధిత వర్క్ వీసాతోనే ప్రయాణించాలని, ట్రాన్సిట్ ప్రయాణికులు కూడా తమ తుది గమ్యస్థానానికి సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది.

ప్రయాణానికి సంబంధించిన అన్ని పత్రాల ప్రింట్, డిజిటల్ కాపీలను వెంట ఉంచుకోవాలని, ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాచారం ఇవ్వాలని రాయబార కార్యాలయం తెలిపింది. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు లేదా దేశంలోకి ప్రవేశం నిరాకరించే అవకాశం ఉండటంతో, ప్రయాణానికి ముందు అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రయాణికులకు సూచించింది.