సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్ర ప్రభుత్వం వరుసగా రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారుల భద్రత, చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల నివారణకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలు, సైబర్ నేరాలకు అవకాశం కల్పించే ప్రచారాలపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. ఇలాంటి ప్రకటనలు ప్లాట్‌ఫామ్‌పైకి ఎలా వచ్చాయో తక్షణమే సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా, వాట్సాప్‌లో ప్రవేశపెట్టనున్న ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పైనా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫోన్ నంబర్‌ను వెల్లడించకుండా యూజర్‌నేమ్ ఆధారంగా ఇతరులతో సంప్రదించే ఈ ఫీచర్‌ను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నకిలీ గుర్తింపులతో మోసాలు, ‘డిజిటల్ అరెస్ట్’ వంటి సైబర్ నేరాలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు సంబంధించి పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా సమర్పించాలని మెటాకు కేంద్రం గడువు విధించింది. వినియోగదారుల డిజిటల్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన ప్రభుత్వం, ప్లాట్‌ఫామ్‌ల భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని సూచించింది. ఈ నోటీసులపై మెటా ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.