తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో వీబీ జీ రామ్‌జీ పథకాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం, రాజధాని అమరావతిపై మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. అమరావతే రాష్ట్ర రాజధాని అని, అది దేవతల రాజధాని అని పేర్కొంటూ, గతంలో అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపిన వైసీపీ తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిందని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఇప్పుడు “మావిగన్” పేరుతో కొత్త ప్రచారం చేస్తున్నారని జగన్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధిపై కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, విశాఖకు రైల్వే జోన్ సాధించామని తెలిపారు. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతోందని, రాయలసీమను అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పారు. వీబీ జీ రామ్‌జీ పథకం గ్రామాల రూపురేఖలను మార్చే కార్యక్రమమని, గ్రామీణ ఉపాధి రంగంలో ఇది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, వీబీ జీ రామ్‌జీ పథకం పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచామని, దీనివల్ల రైతులు, గ్రామీణ కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అలాగే భూసార పరిరక్షణ, రహదారులు, డ్రైనేజీల వంటి అభివృద్ధి పనులను ఈ పథకం ద్వారా చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పారు.