బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాం తన యవ్వనంలో జరిగిన ఓ సరదా సంఘటనను తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. ఒకేసారి 64 చపాతీలు తిన్నానంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ప్రముఖ టీవీ కార్యక్రమం ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్న ఆయన ఈ సరదా సంఘటనను గుర్తు చేసుకున్నాడు.
ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత తాను ఓసారి ఓ గుజరాతీ థాలీ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు జాన్ చెప్పాడు. అక్కడ అన్లిమిటెడ్ థాలీ ఉండేదని, చపాతీలు చాలా చిన్నగా ఉండటంతో వరుసగా 64 చపాతీలు తిన్నానని వెల్లడించాడు.
అంతలో వెయిటర్ వచ్చి ‘సార్.. అన్నం కూడా ఉంది’ అని చెప్పాడని జాన్ నవ్వుతూ చెప్పాడు. దానికి తాను ‘ముందు చపాతీలు పెట్టండి’ అని సమాధానం ఇచ్చానని తెలిపాడు. ఆ 64 చపాతీలు పూర్తయ్యాక చివరకు అన్నం కూడా తిన్నానని జాన్ చెప్పడంతో షోలో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.
జాన్ ప్రస్తుతం ‘ఫోర్స్ 3’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే, తాన్యా మణిక్తల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఫోర్స్’ సిరీస్‌ను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు జాన్ తెలిపారు.