విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పవన్ కల్యాణ్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం నాడు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సాయంత్రం పవన్ విజయవాడలోని లోక్ భవన్ కు వెళ్లారు. ఈ భేటీ చాలా ఆత్మీయంగా, ఫలప్రదంగా జరిగిందని పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా తెలిపారు. పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారని, గవర్నర్ మార్గదర్శకత్వం, ఆతిథ్యం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.

 

అంతకుముందు, పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘ఈగల్’ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను ఐజీ, పవన్‌కు అందజేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను నివేదికలో పొందుపరిచారు.

 

అలాగే, సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపులు, ట్రోలింగ్, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై సైబర్ క్రైమ్ విభాగం తీసుకుంటున్న కఠిన చర్యల గురించి పవన్ కల్యాణ్‌కు వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది.