భారత సముద్ర జలాల్లోని అపారమైన జీవవైవిధ్యానికి నిదర్శనంగా మరో కొత్త ఆవిష్కరణ జరిగింది. కేరళ తీరంలోని అరేబియా సముద్రంలో ఐకార్-సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎమ్ఎఫ్ఆర్ఐ) శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం సముద్రపు చేపను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణతో దేశ సముద్ర జీవజాతుల జాబితాలో మరో కొత్త పేరు చేరింది.
ఈ చేపకు ‘సైటాప్సిస్ ఇండికా’ అని శాస్త్రీయ నామకరణం చేశారు. దీనిని సాధారణంగా ‘ఇండియన్ డోరీ’ అని పిలుస్తారు. దక్షిణ కేరళ తీరానికి సమీపంలో, తూర్పు లక్షద్వీప్ సముద్ర ప్రాంతంలో 350 నుంచి 500 మీటర్ల లోతులో దీనిని గుర్తించారు. కొల్లంలోని శక్తికులంగర ఫిషింగ్ హార్బర్‌లో సేకరించిన ఆరు చేప నమూనాల ఆధారంగా ఈ ఆవిష్కరణ చేశారు.
సీఎంఎఫ్‌ఆర్‌ఐ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్. రతీశ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేపట్టింది. సంప్రదాయ వర్గీకరణ పద్ధతులతో పాటు, ఆధునిక డీఎన్‌ఏ సీక్వెన్సింగ్ విశ్లేషణ ద్వారా దీనిని కొత్త జాతిగా నిర్ధారించారు. ఈ పరిశోధనతో చాలాకాలంగా ఉన్న ఒక శాస్త్రీయ పొరపాటు కూడా సరిదిద్దబడింది. ఇంతకుముందు హిందూ మహాసముద్రంలో దొరికిన ఈ రకం చేపలను ‘సైటాప్సిస్ రోసియా’గా భావించేవారు. కానీ, తాజా డీఎన్‌ఏ విశ్లేషణలో ఇది పూర్తిగా భిన్నమైన జాతి అని తేలింది. ‘సైటాప్సిస్ రోసియా’ కేవలం అట్లాంటిక్ మహాసముద్రానికే పరిమితమని స్పష్టమైంది.
ఈ కొత్త ఆవిష్కరణ వివరాలను ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిషరీస్’ తాజా సంచికలో ప్రచురించారు. కేరళ, లక్షద్వీప్ సముద్ర జలాల్లో ఇంకా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ఎన్నో జీవజాతులు ఉన్నాయని ఈ పరిశోధన మరోసారి నిరూపించిందని నిపుణులు అంటున్నారు. ఈ ప్రాంతాల్లో మరింత లోతుగా అన్వేషిస్తే జీవవైవిధ్య పరిరక్షణకు, మత్స్య సంపద సుస్థిర యాజమాన్యానికి దోహదపడే మరిన్ని ఆవిష్కరణలు సాధ్యమవుతాయని వారు అభిప్రాయపడ్డారు.