తమిళనాడులో ఇకపై ప్రభుత్వం కొనుగోలు చేసే కొత్త బస్సులన్నీ ఎయిర్ కండిషనింగ్ సౌకర్యంతోనే ఉండనున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ తెలిపారు.
ప్రజలు సౌకర్యంగా ప్రయాణించేలా ప్రజారవాణా వ్యవస్థను ఆధునికీకరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పార్థీబన్ తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం చేరాలన్నది సీఎం లక్ష్యమని చెప్పారు. ప్రతి కొత్త బస్సులో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు ఉండాలని, ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించాలని సూచించినట్లు వెల్లడించారు. ఇటీవల విజయ్ ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన విషయం తెలిసిందే.
ఇటీవలే ముఖ్యమంత్రి విజయ్ 300 కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించారు. రూ.127.21 కోట్ల వ్యయంతో వీటిని కొనుగోలు చేశారు. ఇందులో 164 డీజిల్ బస్సులు, 136 బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన సీఎన్జీ బస్సులు ఉన్నాయి. ప్రజారవాణాను మరింత ఆధునికంగా మార్చడంతో పాటు ప్రతి ప్రాంతానికి మెరుగైన బస్సు సౌకర్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.