సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీస్ నుంచి రిలీవ్ చేసింది. జూన్ 30తో ఆయన వయోపరిమితి (సూపర్యాన్యువేషన్) ముగియనున్న నేపథ్యంలో.. సోమవారం నుంచి ఆయనను విధుల్లో నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ సమయానికి ఆయన సర్వీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే, ఆయనపై పెండింగ్‌లో ఉన్న శాఖాపరమైన విచారణలు, క్రిమినల్ ప్రొసీడింగ్‌లకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆల్ ఇండియా సర్వీసెస్ (డెత్-కమ్-రిటైర్మెంట్ బెనిఫిట్స్) రూల్స్-1958 నిబంధనలకు లోబడి ఈ విచారణలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆయనపై గత కొంతకాలంగా వివిధ ఆరోపణలతో సస్పెన్షన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఈ పరిణామంతో సర్వీస్ నుంచి పదవీ విరమణ పొందినప్పటికీ.. సునీల్ కుమార్‌పై ఉన్న క్రిమినల్ కేసులు, అంతర్గత విచారణల విచారణ ప్రక్రియ మాత్రం కొనసాగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో అధికారిక వర్గాల్లో, పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ దర్యాప్తులో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.