హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) కీలక చర్యలకు ఉపక్రమించింది. ప్రధాన ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల లాగ్-అవుట్ (ఆఫీస్ ముగించుకునే) సమయాల్లో మార్పులు చేసేలా కసరత్తు చేస్తోంది. ఒకే సమయంలో వేలాది మంది ఉద్యోగులు రోడ్లపైకి రావడం వల్ల ఏర్పడుతున్న భారీ ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పెట్టేందుకు ఈ సరికొత్త వ్యూహానికి తెరతీసింది.
ఈ ప్రణాళికలో భాగంగా.. వివిధ కంపెనీలు తమ షిఫ్ట్ ముగింపు సమయాలను వేర్వేరుగా ఉండేలా షెడ్యూల్ చేయాలని SCSC ప్రతిపాదిస్తోంది. కొన్ని సంస్థలు సాయంత్రం 4 గంటలకే, మరికొన్ని 5 లేదా 6 గంటలకు తమ ఉద్యోగులను విడిచిపెట్టేలా సమన్వయం చేస్తుండగా.. రాత్రి పూట పనిచేసే నైట్ షిఫ్ట్ వేళల్లోనూ తగిన మార్పులు చేస్తున్నారు. దీనివల్ల రోడ్లపై వాహనాల రద్దీ ఒకేసారి కాకుండా సమయం బట్టి విభజించబడి, ట్రాఫిక్ సజావుగా సాగే అవకాశం ఉంటుంది.
గత కొద్ది రోజులుగా స్థానిక ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఐటీ కంపెనీల యాజమాన్యాలతో వరుస సమావేశాలు నిర్వహించిన SCSC.. ఈ నిర్ణయం పట్ల సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. ఈ మార్పుల వల్ల ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ నరకం తప్పడమే కాకుండా, ప్రయాణ సమయం కూడా గణనీయంగా ఆదా అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.