ఇదిగో మా క్లీంకార.. తొలిసారి కుమార్తెను చూపించిన రామ్‌ చరణ్‌, ఉపాసన

మెగా అభిమానులు ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు తమ ముద్దుల కుమార్తె ‘క్లీంకార కొణిదెల’ ముఖాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఒక అందమైన కుటుంబ చిత్రం ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు కూతురి ప్రైవసీని కాపాడుతూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడిన ఈ జంట, బర్త్‌డే రోజున అభిమానులకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చింది.

‘‘మా అమూల్యమైన చిన్నారి క్లీంకారకు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ ఉపాసన తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ ఫోటోను పంచుకున్నారు. పచ్చని ప్రకృతి మధ్యలో రామ్‌ చరణ్‌, ఉపాసన తమ గారాల పట్టిని ప్రేమగా ఎత్తుకుని ఉండగా.. నీలి రంగు దుస్తుల్లో అమాయకపు చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారి క్లీంకార అందరి చూపును కట్టిపడేస్తోంది. బుగ్గల నిండా నవ్వు, కళ్లలో అమాయకత్వంతో మెరిసిపోతున్న మెగా వారసురాలి కళ్లు, చూట్టానికి సరిగ్గా తాత మెగాస్టార్‌ చిరంజీవి కళ్లలాగే ఉన్నాయంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు.

ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. మూడేళ్లుగా మెగా ప్రిన్సెస్ ఫేస్ రివీల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ చిత్రం పెద్ద పండుగలా మారడంతో, ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ ఫోటోనే హాట్ టాపిక్‌గా నిలిచింది.