విశాఖపట్నంపై పాకిస్థాన్ నిఘా.. బంగాళఖాతంలోకి ప్రవేశించిన పాక్ జలాంతర్గామి

భారత నావికాదళానికి అత్యంత కీలకమైన తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంపై పాకిస్థాన్ కన్నేసినట్లు తెలుస్తోంది. తాజాగా బంగాళఖాతంలోకి పాకిస్థాన్‌కు చెందిన జలాంతర్గామి (సబ్‌మెరైన్) రహస్యంగా ప్రవేశించినట్లు వస్తున్న వార్తలు దేశ భద్రతా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. భారత నావికాదళ కదలికలపై నిఘా ఉంచే ఉద్దేశంతోనే పాక్ ఈ దుస్సాహసానికి ఒడిగట్టిందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

భారత అణ్వాయుధ జలాంతర్గాములకు, కీలకమైన యుద్ధనౌకలకు విశాఖపట్నం అత్యంత ప్రధానమైన రక్షణ స్థావరం. ఈ నేపథ్యంలోనే ఇక్కడి నావికాదళ కదలికలను పసిగట్టేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నినట్లు భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. పాక్ సబ్‌మెరైన్ ఎంట్రీని పసిగట్టిన భారత నావికాదళం తక్షణమే అప్రమత్తమైంది. బంగాళఖాతంలో శత్రు జలాంతర్గాముల కదలికలను ట్రాక్ చేసి, వాటిని నిర్వీర్యం చేసేందుకు వీలుగా అధునాతన నిఘా విమానాలను, యాంటీ సబ్‌మెరైన్ యుద్ధనౌకలను రంగంలోకి దించినట్లు సమాచారం.

సముద్ర మార్గం గుండా దొంగచాటుగా భారత జలాల్లోకి చొరబడి నిఘా కార్యకలాపాలు సాగించాలన్న పాక్ కుటిల యత్నాలను భారత నావికాదళం ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాక్ జలాంతర్గామి కదలికలపై నిరంతరం డేగకన్ను వేసి ఉంచామని, దేశ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లినా దీటుగా బదులివ్వడానికి భారత రక్షణ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తాజా పరిణామాల దరిమిలా తూర్పు సముద్ర తీర ప్రాంతాల్లో రక్షణ యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది.