తెలుగు వెండితెరపై వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా తనదైన నటనతో ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల జీవితం ప్రస్తుతం అత్యంత దయనీయంగా మారింది. గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆమె.. ఇటీవల హైదరాబాద్‌లోని ఒక ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో కనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఒక సీనియర్ నటి, వృద్ధాప్యంలో కనీసం ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి లేక రోడ్డున పడటం చూసి చిత్ర పరిశ్రమతో పాటు సామాన్య ప్రజలు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
పావలా శ్యామలకు గతంలోనే ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మరియు ప్రభుత్వం తరఫున కొంత ఆర్థిక సాయం, పెన్షన్ అందినప్పటికీ.. ఆమెతో పాటు ఉన్న కుమార్తె కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో వైద్య ఖర్చులు కొండలా పేరుకుపోయాయి. ఉన్న ఇల్లు ఖాళీ చేయాల్సి రావడం, చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో ఆమె రోడ్డుపైకి రాక తప్పలేదని సమాచారం. ఈ క్రమంలో ఆమె దీనగాథను తెలుసుకున్న కొందరు సామాజిక కార్యకర్తలు, తోటి కళాకారులు తక్షణమే స్పందించి ఆమెకు అండగా నిలిచారు.
ప్రస్తుతం పావలా శ్యామలను సురక్షితమైన ప్రదేశానికి తరలించి, తాత్కాలిక వసతితో పాటు ఆహారం, వైద్య సదుపాయాలు అందేలా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన మరికొందరు ప్రముఖులు కూడా ఆమె పరిస్థితిపై స్పందిస్తూ శాశ్వత పరిష్కారం చూపేందుకు ముందుకొస్తున్నారు. ఎంతోమందిని తన నటనతో అలరించిన ఒక వృద్ధ కళాకారిణికి ఇకనైనా ప్రశాంతమైన జీవితం లభించేలా, ఇండస్ట్రీ పెద్దలు మరియు ప్రభుత్వం శాశ్వత నివాస, వైద్య సాయం అందించాలని నెటిజన్లు కోరుతున్నారు.