కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ సున్నితమైన వ్యవహారంపై సినీ నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా అత్యంత తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందని పేర్కొన్న ఆయన, మైనర్ బాలికలకు ఏ పరిస్థితుల్లోనైనా న్యాయం జరగాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే పోక్సో చట్టాన్ని తీసుకువచ్చారని తాను గట్టిగా నమ్ముతున్నట్లు కుండబద్ధలు కొట్టారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ, చట్టం ముందు అందరూ సమానమేనని, బాధితులకు న్యాయం జరిగే క్రమంలో నిందితుల అధికారం, హోదా, పదవి లేదా పలుకుబడి ఏమాత్రం అడ్డురాకూడదని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి అమ్మాయికి రక్షణ పొందడం ప్రాథమిక హక్కని ఆయన గుర్తుచేశారు. ఒక కేంద్ర మంత్రి కుమారుడు ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో, ఎవరూ చట్టానికి అతీతులు కారని నిరూపించేలా.. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విచారణ సాగాలని ఆయన ఆకాంక్షించారు.
మైనర్లకు సంబంధించిన ఇలాంటి కేసుల్లో అత్యంత వేగంగా, పారదర్శకంగా విచారణ జరగాలని మనోజ్ డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఏమాత్రం ఆలస్యం చేసినా, మౌనం వహించినా న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లుతుందని ఆయన హెచ్చరించారు. ఇది రాజకీయాలకు లేదా వ్యక్తులకు సంబంధించిన విషయం కాదని, కేవలం సత్యం బయటకు రావాలని స్పష్టం చేశారు. “బాధితురాలికి న్యాయం జరగడమే కాదు, అది జరుగుతున్నట్లు సమాజం అందరికీ స్పష్టంగా కనిపించాలి” అని డిమాండ్ చేస్తూ విచారణను వేగవంతం చేయాలని మంచు మనోజ్ ప్రభుత్వాన్ని కోరారు.