ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడటంలో CPR & FIRST AID కీలకం: జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.

తేది: 17-04-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా : ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడటంలో CPR & FIRST AID కీలకం: జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ప్రమాదం జరిగిన వ్యక్తికి వెంటనే ప్రథమ చికిత్స అందించడం సామాజిక బాధ్యత,
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే “రహ్ వీర్” పథకం ద్వారా రూ.25,000 పారితోషికం.
“Arrive Alive” కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ రెస్పాండర్స్‌కు CPR & FIRST AID శిక్షణ.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఫస్ట్ రెస్పాండర్స్‌కు CPR & FIRST AID శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ శిక్షణలో ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న దుకాణాలు, హోటళ్లు, పంక్చర్ షాపులు, పెట్రోల్ బంకులు నిర్వహించే వ్యక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ… ప్రస్తుత కాలంలో ప్రమాదాలు జరిగినప్పుడు సమయానికి ప్రథమ చికిత్స అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని, ఈ సమయంలో సరైన చికిత్స అందిస్తే అనేక ప్రాణాలను రక్షించవచ్చని చెప్పారు. ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించి ఆసుపత్రికి తరలించడం అత్యంత ముఖ్యమని సూచించారు.
సోషల్ మీడియాలో చూసి సరైన అవగాహన లేకుండా CPR, ప్రథమ చికిత్స చేయడం వల్ల మరింత ప్రమాదం సంభవించే అవకాశముందని, అందుకే శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గ్రామస్థాయిలో CPR & FIRST AID శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలను అవసరమైన సమయంలో వినియోగించి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే “రహ్ వీర్” పథకం ద్వారా రూ.25,000 పారితోషికం.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రహ్ వీర్” పథకం ద్వారా రూ.25,000 నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రం అందజేయబడుతుందని ఎస్పీ గారు తెలిపారు. ప్రమాదం జరిగిన తొలి గంట “గోల్డెన్ అవర్”లో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే ప్రాణాలను రక్షించవచ్చని అన్నారు.
పోలీస్ కేసుల భయం కారణంగా కొందరు సహాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని, గుడ్ సమారిటన్ చట్టం ప్రకారం సహాయం చేసిన వారికి ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రాణాలను కాపాడే కార్యంలో భాగస్వామి కావాలని కోరారు.
ఈ సందర్భంగా వైద్య నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాలు, స్పృహ తప్పిన పరిస్థితులు, ఎండ దెబ్బ, పాము కాటు, గుండెపోటు వంటి సందర్భాల్లో అందించాల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో DM&HO శ్రీలత, డాక్టర్ శ్రీనివాస్, రాజేందర్, సుదీర్, లవ కుమార్, శ్రీకాంత్, DCRB సబ్-ఇన్స్పెక్టర్ ప్రదీప్ , ఫస్ట్ రెస్పాండర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *