ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘రామాయణం’ ఒకటి. రణ్‌బీర్ కపూర్, యష్, సాయి పల్లవి, సన్నీ డియోల్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ హైప్ ఉంది. ఇటీవల విడుదలైన నాలుగు నిమిషాల ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఇంగ్లీష్ ట్రైలర్లో నవంబర్ 6 తేదీ కనిపించడంతో ఈ సినిమా భారత్‌లో కూడా అదే రోజు విడుదలవుతుందా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
ఈ గందరగోళానికి నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా తెరదించారు. భారత్‌లో ‘రామాయణం’ దీపావళి సందర్భంగా నవంబర్ 8న విడుదల కానుందని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో విదేశీ మార్కెట్లలో మాత్రం నవంబర్ 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ట్రైలర్లో కనిపించిన నవంబర్ 6 తేదీ భారతీయ రిలీజ్‌కు సంబంధించినది కాదని స్పష్టమైంది.
విదేశాల్లో రెండు రోజుల ముందుగా సినిమాను విడుదల చేయడం వెనుక డిస్ట్రిబ్యూషన్, వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్లను దృష్టిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 2026 నవంబర్ 6 శుక్రవారం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆ తేదీని ఎంచుకున్నట్లు నమిత్ మల్హోత్రా తెలిపారు. అయితే విదేశాల్లో ముందుగా సినిమా విడుదల కావడంతో కీలక సన్నివేశాలు ఆన్లైన్లో లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. దీంతో భారతీయ ప్రేక్షకుల థియేట్రికల్ అనుభవాన్ని కాపాడేందుకు మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.