మహిళలను కించపరచడం జర్నలిజమా..? రాధాకృష్ణ వ్యాఖ్యలపై జగన్ ఫైర్..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “రేపు వైయస్‌ జగన్ మోహన్ ‌రెడ్డి మీ భార్యలను మీ భార్యలు కాదని చెబితే, మీరు దాన్ని నమ్మి, మీ సొంత భార్యలను అక్కచెల్లెళ్లుగా భావించి మరీ పెళ్లి సంబంధాలు చూసే స్థాయికి దిగజారిపోతారు. అంతగా వెన్నెముకలేని నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు!” అంటూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని జగన్ మండిపడ్డారు. రాజకీయ విమర్శల పేరుతో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం, వారిని అసహ్యకరమైన చర్చల్లోకి లాగడం జర్నలిజం కాదని, అది ముమ్మాటికీ మహిళా లోకంపై చేసిన దాడి అని అన్నారు.

 

మహిళలను ఉద్దేశించి ఇలాంటి దిగజారిన భాషను ఉపయోగించడంపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వివక్ష పూరితమైన జర్నలిజం చేస్తూ, రాజకీయ లబ్ధి కోసం కుటుంబ సభ్యులను అవమానించడం రాధాకృష్ణ నైజమని విమర్శించారు. ప్రజల్లో “MAVIGUN” ప్రతిపాదనపై జరుగుతున్న విస్తృత చర్చను దారి మళ్లించడానికి, చంద్రబాబు నాయుడు, ఆయనకు అనుకూల మీడియా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి విషపూరిత ప్రచారాలకు తెరలేపారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి నీచమైన దూషణలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

 

రాధాకృష్ణ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాయని జగన్ పేర్కొన్నారు. ఇంతటి అవమానకర మాటలు విన్నప్పటికీ, తమ నాయకులు, కార్యకర్తలు ఎక్కడా హింసకు తావులేకుండా, అత్యంత సంయమనంతో, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ నిరసన తెలిపారని కొనియాడారు. రాధాకృష్ణ తన వ్యాఖ్యలకు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

రాధాకృష్ణ చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండించకపోగా, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ వంటి నేతలు మౌనంగా ఉంటూ పరోక్షంగా మద్దతు తెలపడం వారి ద్వంద్వ నీతిని చాటుతోందని జగన్ విమర్శించారు. మహిళల పట్ల వారికి ఉన్న అవమానకర ధోరణిని, ద్వేషభావాన్ని ఈ మౌనం ప్రతిబింబిస్తోందని అన్నారు. బాధ్యతారహితమైన, విషపూరితమైన వ్యాఖ్యలను సమర్థిస్తున్న నాయకుల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వారికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *