రిజర్వేషన్లపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు..!

పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాలను మార్చడానికి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తప్పు నెంబర్ డయల్ చేశారని.. ఇది నిరసనలు, ఆందోళనలు చేసే కాలామని సీజేఐ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు. పిటిషన్ కూడా ఆ మార్గాన్నే ఎంచుకుంటే బాగుండేదని ఛమత్కరించారు. దీనికి పిటిషనర్ సమాధానమిస్తూ తనకు నిరసనలు తెలిపే ఉద్దేశం లేదని పైగా గొంతు నొప్పిగా ఉందంటూ బదులు ఇవ్వడంతో కోర్టులో నవ్వులు పూశాయి.

యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లా కాదీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జగదీష్ సింగ్ అనే ఓటరు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 1952లో జరిగిన మొదటి ఎన్నికల నుండి ఇప్పటివరకు దాదాపు 70 ఏళ్లుగా ఈ నియోజకవర్గం ఎస్సీ (SC) వర్గానికే రిజర్వ్ అయి ఉండిపోయిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల నాలుగైదు కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయని ఆరోపించారు. పంచాయితీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో అమలు చేస్తున్నట్లుగానే అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు కూడా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ పిటిషన్ ను సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా జస్టిస్ బాగ్చీ స్పందిస్తూ జనాభాలోని మెజారిటీ వర్గాలు కేవలం కులం లేదా సముదాయాన్ని చూసే ఓటేస్తారని ముందస్తుగా భావించలేమని పేర్కొన్నారు. ఒక నియోజకవర్గం రిజర్వ్ అయినంత మాత్రాన పౌరుడి ఓటు హక్కుకు ఎలాంటి భంగం వాటిల్లదని, ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికైనా ఓటు వేసే స్వేచ్ఛ ఓటరుకు ఉందన్నారు. అలాగే పోటీ చేయాలనుకునేవారు ఇతర సాధారణ (Non-reserved) నియోజకవర్గాల నుండి కూడా పోటీ చేయవచ్చని గుర్తుచేశారు.

రాజకీయ సిద్ధాంతాల ఆధారంగానే ఎన్నికలు

బహుళ పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రజలు.. అభ్యర్థి కులం లేదా మతాన్ని బట్టి కాకుండా రాజకీయ పార్టీలు, వాటి సిద్ధాంతాల ఆధారంగానే ఓటు వేస్తారని జస్టిస్ బాగ్చీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 332 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్ కల్పించే నిబంధన ఉన్నప్పటికీ, ఏ స్థానాన్ని రిజర్వ్ చేయాలనేది ప్రత్యేక అంశమని తెలిపారు. ఒక చట్టం సుదీర్ఘకాలం అమలులో ఉండటం వల్ల సమాజంలో కుల వ్యవస్థ బలపడుతుందా? లేదా? అనేది చట్టసభలు పరిశీలించాల్సిన విషయమని అన్నారు. అంతమాత్రాన చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటింపలేమని కోర్టు తేల్చిచెప్పింది.

అయితే పంచాయతీలు, మున్సిపాలిటీలలో రొటేషన్ విధానం ఉందనే వాదనను పిటిషనర్ తరపు లాయర్ వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D, 243T లను ఉటంకించారు. అయితే స్థానిక సంస్థల రిజర్వేషన్లను రాజ్యాంగం ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగ నిబంధనలను కోర్టులు తిరగరాయలేవని.. పార్లమెంట్‌లో తాము ‘మూడో సభ’ (Third Chamber) పాత్రను పోషించలేమని జస్టిస్ బాగ్చీ స్పష్టం చేశారు. ఈ అంశంలో చట్టసభలు మాత్రమే నిర్ణయం తీసుకోగలవని పేర్కొంటూ పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.