తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు..! తెలంగాణ జాగృతి పార్టీ పోస్టర్ ఆవిష్కరణ..!

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. ప్రత్యామ్నాయ రాజకీయాలే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పార్టీ సరికొత్త ప్రస్థానానికి శ్రీకారం చుడుతోంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఈ పార్టీ ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తుందని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 25న కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించనున్న నూతన రాజకీయ పార్టీ మహాసభకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఆయన ఆవిష్కరించారు.

 

ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, వారి ఆశయాలకు అనుగుణంగానే ఈ పార్టీ రూపుదిద్దుకుంటోందని వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రాష్ట్ర సంస్కృతిని, అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో కవిత గారు పోషించిన పాత్ర అద్వితీయమని ఆయన కొనియాడారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు ప్రజల మౌలిక సమస్యలే అజెండాగా, ఒక శక్తివంతమైన వేదికగా ఈ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.

 

మేడ్చల్ జిల్లా మునిరాబాద్‌లో జరగనున్న ఈ భారీ మహాసభకు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును మార్చే ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు ఎత్తరి గణేష్, కందాడి గౌతమ్ రెడ్డి, మంచాల వంశీ చారి, గిరిశెట్టి రాజు, వరికుప్పల సంతోష్‌తో పాటు స్థానిక యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొత్త పార్టీ రాకతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *