ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం..అమరావతికి శాశ్వత చట్టబద్ధత.. : సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఈ చారిత్రాత్మక సందర్భంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదిక‌గా హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు దక్కిన గొప్ప గౌరవమని అభివర్ణించారు. జాతీయ స్థాయిలో మన రాష్ట్ర గళం బలంగా వినిపించిన క్షణమిదని ఆయన పేర్కొన్నారు.

 

రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిన నిబద్ధత అమోఘమని చంద్రబాబు కొనియాడారు. 2015 అక్టోబర్ 22న రాజధాని శంకుస్థాపన నుండి నేటి వరకు ప్రతి కీలక దశలోనూ ఆయన అండగా నిలిచారని గుర్తు చేశారు. అమరావతి విజన్‌ను పునరుద్ధరించడంలో మోదీ ప్రభుత్వం అందించిన సహకారాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు భారత ప్రభుత్వం ఈ ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ విభేదాలకు అతీతంగా అమరావతిని ప్రజా రాజధానిగా గుర్తించిన పార్లమెంటు సభ్యులందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని లేక అనేక సవాళ్లను ఎదుర్కొందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో కూడా అమరావతి రైతులు చూపిన సహనం వారి త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. ఈ చారిత్రాత్మక విజయం కచ్చితంగా ఆ రైతులకే అంకితమని ప్రకటించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ స్థిరత్వం రాష్ట్రంలో సరికొత్త సాధికారతకు ఆత్మవిశ్వాసానికి దారితీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడి ప్రగతికి ఈ నిర్ణయం ఒక పునాదిలా మారుతుందని నొక్కి చెప్పారు.

 

ఇకపై అమరావతి హోదాపై ఎలాంటి చర్చలు ఉండబోవని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ బిల్లు ఆమోదంతో రాజధాని హోదా సుస్థిరమైందని ఎవరూ మార్చలేని విధంగా చట్టబద్ధత లభించిందని చెప్పారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ హృదయమని దేశానికే గర్వకారణంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు అమరావతి ప్రయాణం అప్రతిహతంగా సాగుతుందని భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *