కొండగట్టులో తడక చలువ పందిరి కూలిన ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు.

తేది: 01-04-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS
రిపోర్టర్ కాశిరెడ్డి నాగరాజు.

జగిత్యాల జిల్లా: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో శానిటేషన్ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా తడక చలువ పందిరి కూలిన ఘటన స్థలాన్ని జగిత్యాల డీపీఓ మధన్ మోహన్, జగిత్యాల, కోరుట్ల డీఎల్పీఓలు సందర్శించారు. కూలిన పందిరి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన అధికారులు పలు కీలక సూచనలు చేశారు.
చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా శుభ్రత పనులను మరింత మెరుగుపరచాలని, భద్రతా చర్యలతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అలాగే ఆలయ పరిసరాల్లో పార్కింగ్ సదుపాయాలను పరిశీలించిన అధికారులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సరైన నిర్వహణ ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ఆలయ పరిసరాల్లో ప్రత్యేక బృందాలు డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తూ అప్రమత్తంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *