మునుగోడు కోసం రాజీనామాకైనా సిద్ధం.. MLA రాజగోపాల్ రెడ్డి ఫైర్..!

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష జరుగుతోందని, కేవలం మంత్రుల నియోజకవర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు. తన ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఈ పదవిలో ఉండటానికి తాను అనర్హుడినని, ఎమ్మెల్యేగా కొనసాగడం వృధా అని ఆవేద‌న చెందారు.

 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులన్నీ కేవలం మంత్రుల నియోజకవర్గాలకే వెళ్తున్నాయనే టాక్ ఉందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలైన మధిర, హుజూర్‌నగర్‌లకే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ తరలిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అంటే కేవలం మంత్రులు మాత్రమే కాదు.. నిధుల కోసం ప్రతిసారీ సీఎం, మంత్రుల చుట్టూ తిరగాలా? అని ఆయన నిలదీశారు. సీఎం తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ను అభివృద్ధి చేసుకున్నట్లే, తనకు కూడా మునుగోడును అభివృద్ధి చేసుకోవాలని ఉండదా అని ప్రశ్నించారు.

 

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మునుగోడులోని ఉదయ సముద్రం వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా విస్మరించారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన పనుల తర్వాత, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే పనులు సాగుతున్నాయని చెబుతూనే.. కాలువలు పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష ఎకరాలకు నీరు ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టు విషయంలో జాప్యం జరుగుతోందని, ఏడాది కాలంగా ప్రజలు తనను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా ఈ మనోవేదనతో రగిలిపోతున్నానని, ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.

 

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే వెయ్యి రెట్లు పారదర్శకంగా, ఆర్థిక క్రమశిక్షణతో పని చేస్తోందని రాజగోపాల్ రెడ్డి కొనియాడారు. అయితే, అభివృద్ధి పనులు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. “అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా మీ తమ్ముళ్లుగా భావించి నిధులు కేటాయించండి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు పలికారు. తాను ఎటువంటి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని, తన ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పునరుద్ఘాటించారు.

 

బడ్జెట్‌లో విద్యకు కేవలం 8.2 శాతం నిధులు మాత్రమే కేటాయించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత తక్కువ నిధులతో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఆలోచన బాగుందని మెచ్చుకుంటూనే, వీటిని మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని సూచించారు. కస్తూర్బా, గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు అందే ఆహారంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కోరారు.

 

రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి, జిల్లా కేంద్రాల నుండి మండలాలకు వేస్తున్న రోడ్లలో ‘బ్లాక్ స్పాట్’ల వద్ద భూసేకరణ జరగడం లేదని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని రాజగోపాల్ రెడ్డి ఎత్తిచూపారు. వీటిని నివారించడానికి ఇండిపెండెంట్ ఇంజనీర్లను నియమించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, అభివృద్ధిలో మునుగోడుకు అగ్రతాంబూలం ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *