వార్ ఎఫెక్ట్ భారత్ పై పడనీయం: మోదీ..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అనేక దేశాల్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఇటువంటి సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. దేశంలోని సామాన్య ప్రజలు సహా రైతులపై ఈ ప్రభావం పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. క్లిష్ట సమయాల్లోనూ దేశ అభివృద్ధిని నిరంతరం ముందుకు తీసుకెళుతున్నామని మోదీ వివరించారు.

 

ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా నోయిడాలో సెమీకండక్టర్ ప్లాంట్ నిర్మించామని ప్రధాని తెలిపారు. ఢిల్లీ-మీరట్ మెట్రో రైలుతో పాటు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకోవడం డబుల్ ఇంజన్ సర్కార్ పనితీరుకు నిదర్శనమని కొనియాడారు. జేవర్ విమానాశ్రయం రాకతో ఉత్తరభారతం ప్రపంచ దేశాలతో నేరుగా అనుసంధానం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రతి రెండు నిమిషాలకు ఒక విమానం గగనతలానికి ఎగురుతుందని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు.

 

యూపీని అడ్డగోలుగా దోచుకున్నారు..

 

గత యూపీఏ ప్రభుత్వంపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2004 నుంచి 2014 వరకు ఉన్న పాలకులు ఉత్తరప్రదేశ్‌ను అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. జేవర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు పదేళ్ల పాటు కేవలం ఫైళ్లకే పరిమితం అయిందని ఎద్దేవా చేశారు. కేంద్రంలోనూ అలాగే యూపీలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తయిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఇది ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. ఇక్కడి విమానాశ్రయం ద్వారా రైతులు పండించే పంటలు అలాగే ఉద్యోగులు తయారు చేసే వస్తువులు ప్రపంచ నలుమూలలకు వేగంగా చేరుతాయని భరోసా ఇచ్చారు.

 

గతంలో ఉన్న అంధ విశ్వాసాల వల్ల నోయిడా ప్రాంతాన్ని పాలకులు పూర్తిగా పక్కన పడేశారని ప్రధాని మండిపడ్డారు. సమాజ్ వాదీ పార్టీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నోయిడాలో అడుగు పెట్టే ధైర్యం కూడా చేయలేదని విమర్శించారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు ప్రధాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సహకారం వల్లే నోయిడాలో సరికొత్త అభివృద్ధి శకం ప్రారంభమైందని కొనియాడారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం పారిశ్రామికంగా మరింత వృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *