తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీ తప్ప సామాన్య ప్రజలకు దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు మరియు పేద వర్గాలను విస్మరించి, వారిని మోసం చేసే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆయన మండిపడ్డారు. గత బడ్జెట్ అంచనాలను అందుకోవడంలోనే విఫలమైన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి అబద్ధపు లెక్కలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వెనకబడిందని వేముల విమర్శించారు. మహిళలకు నెలకు రూ. 2,500 సాయం, తులం బంగారం మరియు పెన్షన్ల పెంపు వంటి కీలక హామీల ఊసే బడ్జెట్లో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన ‘రైతు భరోసా’ను కూడా ఎగ్గొట్టారని, నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రస్తావన బడ్జెట్లో కనిపించలేదని ఆయన దుయ్యబట్టారు. కేవలం అవినీతికి అవకాశం ఉన్న ప్రాజెక్టులకే భారీగా నిధులు కేటాయించారని ఆరోపించారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు బడ్జెట్ వేదికగా ప్రజలకు మంగళం పాడుతోందని వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏ ఒక్క వర్గానికి కూడా ఉపయోగపడే స్పష్టమైన పథకం లేదా కేటాయింపు ఈ బడ్జెట్లో లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితమవుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని తన విమర్శల్లో పేర్కొన్నారు.