కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సహకార రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ ‘భారత్ ట్యాక్సీ’ అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. కేవలం రూ.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, ఇప్పటివరకు డ్రైవర్లకు రూ.35 కోట్లకు పైగా ఆదాయాన్ని అందించిందని ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో ప్రకటించింది. ఈ వినూత్న చొరవ ద్వారా సుమారు 20,000 మంది డ్రైవర్లకు, 200 మంది సహాయక సిబ్బందికి ఉపాధి లభించింది. ఈ వ్యవస్థలో డ్రైవర్లను ‘సారథులు’గా పిలుస్తారని, వారే యజమానులుగా నిర్ణయాధికారంలో భాగస్వామ్యం వహిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్రైవేట్ క్యాబ్ అగ్రిగేటర్ల మాదిరిగా కాకుండా, భారత్ ట్యాక్సీ డ్రైవర్ల నుంచి ఎటువంటి కమీషన్ వసూలు చేయదు. రైడ్ ద్వారా వచ్చే పూర్తి ఆదాయం నేరుగా డ్రైవర్లకే చేరుతుంది; దీనికి బదులుగా వారు కేవలం స్వల్ప సబ్‌స్క్రిప్షన్ ఫీజును మాత్రమే చెల్లిస్తారు. ప్రయాణికుల విషయానికొస్తే, కేవలం ట్రిప్ ఛార్జీ మాత్రమే వసూలు చేస్తారు. ఇతర యాప్‌లలో ఉండే సర్జ్ ప్రైసింగ్ (డిమాండ్ పెరిగినప్పుడు ధర పెంచడం) లేదా అదనపు కన్వీనియన్స్ ఫీజులు ఇందులో ఉండవు. ఇది అటు డ్రైవర్లకు, ఇటు వినియోగదారులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా మారింది.
‘సహకారం ద్వారా సమృద్ధి’ అనే లక్ష్యంతో 2025 జూన్ 6న స్థాపించబడిన ఈ సంస్థ, ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి తన సేవలను అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంతో పాటు గుజరాత్‌లోని అహ్మదాబాద్, రాజ్‌కోట్, సోమనాథ్ మరియు ద్వారక వంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. దశలవారీగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు భారత్ ట్యాక్సీని విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మోడల్ డ్రైవర్ల గౌరవప్రదమైన జీవనోపాధికి మరియు రవాణా రంగంలో సమ్మిళిత వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.