చైనాలోని రిజావో పోర్టుకు వెళ్లాల్సిన రష్యా చమురు ట్యాంకర్ ‘అక్వాటైటాన్’, హఠాత్తుగా తన దిశను మార్చుకుని భారత్ వైపు వస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నెల 21వ తేదీన ఈ ట్యాంకర్ కర్ణాటకలోని న్యూమంగళూరు పోర్టుకు చేరుకోనుందని ఆ వార్తల సారాంశం. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల (ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం) నేపథ్యంలో చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా రష్యా నుంచి భారత్ దిగుమతులు పెంచిన తరుణంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వార్తలపై భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా స్పందించారు. సదరు రష్యన్ ట్యాంకర్ భారత్ వైపు మళ్లిందనే అంశంపై తమ వద్ద ప్రస్తుతం ఎటువంటి అధికారిక సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని, అయితే ఈ నిర్దిష్ట ట్యాంకర్ విషయంలో తమకు ఇంకా ఎటువంటి అభ్యర్థన అందలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం కారణంగా రష్యా తన చమురును వివిధ దేశాలకు తరలిస్తోంది. ఈ క్రమంలో చైనాకు కేటాయించిన లోడ్‌ను భారత్‌కు మళ్లించారా లేదా అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఒకవేళ ఈ ట్యాంకర్ న్యూమంగళూరుకు చేరుకుంటే, అది భారత ఇంధన నిల్వలకు అదనపు బలాన్ని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నౌక కదలికలపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా నిఘా ఉంచింది.