బీజేపీ కార్యకర్తలపై వరుస దాడులు: డీజీపీకి రాంచందర్‌రావు ఫిర్యాదు.. విచారణకు హామీ!

తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మంగళవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డిని కలిశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే అధికార కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత దాడులకు దిగుతోందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు పోలీస్ యంత్రాంగం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ డీజీపీకి వినతిపత్రం సమర్పించారు.

పోటీ నుంచి తప్పుకోవాలని హెచ్చరించినా వినకుండా ధైర్యంగా నిలబడిన తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని రాంచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులే కాకుండా, బాధ్యత గల పోలీసు అధికారులు కూడా దాడులకు పాల్పడటం శోచనీయమని ఆయన ధ్వజమెత్తారు. గతంలో నల్గొండ ఎస్పీ, ఇటీవల పరిగి సీఐ బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేసిన ఘటనలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

హోం శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అరాచకాలపై తక్షణమే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీస్ శాఖ అంతా కాంగ్రెస్ కార్యకర్తల విభాగంలా మారిపోయిందని ఆయన ఘాటుగా విమర్శించారు. అయితే, తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని, ఈ ఘటనలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని రాంచందర్‌రావు తెలిపారు. విచారణలో న్యాయం జరగకపోతే బీజేపీ తరపున ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *