ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమిళ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ వెట్రి కళగం (TVK) పార్టీని స్థాపించిన నటుడు విజయ్ గురించి ప్రస్తావిస్తూ.. విజయ్ ఒక మంచి వ్యక్తి అని, ఆయనకు సమాజం పట్ల స్పష్టమైన అవగాహన ఉందని కొనియాడారు. ఒకవేళ విజయ్ దేశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఎన్డీఏ కూటమిలోకి రావాలని భావిస్తే, తాను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తానని పవన్ పేర్కొన్నారు.
అయితే, విజయ్‌ను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తూ తాను ఎటువంటి అధికారిక ప్రతిపాదన పెట్టలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విజయ్‌ను తాను కలిసి దాదాపు పాతికేళ్లు అవుతోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయ దృక్పథంతో పనిచేసే యువ నాయకులు తమిళనాడు రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని, అయితే కూటమిలో చేరడం అనేది పూర్తిగా వారి వ్యక్తిగత మరియు పార్టీ నిర్ణయమని పవన్ అభిప్రాయపడ్డారు.
తమిళనాడులోని ద్రావిడ రాజకీయాలపై స్పందిస్తూ.. సనాతన ధర్మం మరియు ఆధ్యాత్మికతను విస్మరించి చేసే రాజకీయం ఎక్కువ కాలం నిలబడదని పవన్ వ్యాఖ్యానించారు. సినిమా స్టార్లు రాజకీయాల్లో రాణించాలంటే పట్టుదల, ఓపిక చాలా అవసరమని, విమర్శలను తట్టుకుని ప్రజల్లో నిలబడాలని ఆయన సూచించారు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.