ట్రంప్‌కు చైనా షాక్: హార్ముజ్ రక్షణకు వస్తాం కానీ.. అమెరికా ముందు భారీ షరతు!

హార్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచేందుకు అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా చైనా వంటి దేశాలు ముందుకు రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గం ప్రమాదంలో పడిందని, దీనివల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతున్న చైనా దాని రక్షణ బాధ్యతను పంచుకోవాలని ట్రంప్ సూచించారు. చైనా స్పందనను బట్టే తన బీజింగ్ పర్యటనపై నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ట్రంప్ విజ్ఞప్తిపై స్పందించిన చైనా ఒక కీలకమైన షరతును విధించింది. హార్ముజ్ జలసంధిలో ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు తాము సహకరిస్తామని, అయితే అంతకంటే ముందు అమెరికా పశ్చిమాసియాలో తన సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఈ ఘర్షణల వల్ల అంతర్జాతీయ శాంతి మరియు ప్రపంచ స్థిరత్వం దెబ్బతింటున్నాయని చైనా ఆందోళన వ్యక్తం చేసింది. సైనిక దాడులు ఆగితేనే ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ పేర్కొన్నారు.

మరోవైపు, హార్ముజ్ రక్షణ కోసం సంయుక్తంగా పనిచేయాలన్న ట్రంప్ పిలుపుకు ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ తమ యుద్ధనౌకలను పంపలేమని ఆ దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో, చైనా విధించిన షరతుపై అమెరికా ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల చివరలో జరగాల్సిన ట్రంప్ బీజింగ్ పర్యటన ఇప్పుడు ఈ దౌత్యపరమైన చర్చలపైనే ఆధారపడి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *