తమిళ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ మరియు నటి త్రిషల వ్యక్తిగత వ్యవహారంపై వస్తున్న వార్తలపై తమిళనాడు బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ ఘాటుగా స్పందించారు. వీరిద్దరి విషయంలో ప్రజలకు ఎందుకు అంత ఆసక్తి కలుగుతుందో తనకు అర్థం కావడం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారికే ఉంటుందని, దానిని పెద్ద విషయంగా చూడాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఖుష్బూను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా విజయ్, త్రిషల అంశం రాబోయే తమిళనాడు ఎన్నికల్లో టీవీకే (TVK) పార్టీపై ప్రభావం చూపుతుందా? అని ప్రశ్నించగా ఆమె స్పష్టతనిచ్చారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు బాగా తెలుసని, నాయకుల వ్యక్తిగత జీవితాలను చూసి ప్రజలు ఓట్లు వేయరని ఆమె పేర్కొన్నారు. నటుల ప్రైవేట్ వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని ఖుష్బూ హితవు పలికారు.
సినిమా రంగంలో ఉన్న వారి మధ్య స్నేహం లేదా ఇతర సంబంధాల గురించి చర్చించడం సాధారణమే అయినప్పటికీ, అది వారి రాజకీయ ఎదుగుదలపై ప్రభావం చూపుతుందనుకోవడం పొరపాటని ఆమె వ్యాఖ్యానించారు. కొద్ది కాలంగా సోషల్ మీడియాలో విజయ్, త్రిషల గురించి వస్తున్న పుకార్లపై ఖుష్బూ స్పందించిన తీరు ప్రస్తుతం కోలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని, ప్రజల సమస్యలపై దృష్టి సారించడం ఉత్తమమని ఆమె ఈ సందర్భంగా సూచించారు.