గత ఐదేళ్ల జగన్ పాలన కేవలం తన సొంత కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సాగిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యంగా భారతి సిమెంట్ వ్యాపారాన్ని విస్తరించేందుకు జగన్ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సిమెంట్ బస్తా ధరను కృత్రిమంగా పెంచి ప్రజలపై రూ.165 కోట్ల భారం మోపారని, ఆ సొమ్మును తన కంపెనీకి మళ్లించుకున్నారని ధ్వజమెత్తారు. అలాగే సాక్షి మీడియాకు ప్రకటనల రూపంలో రూ.400 కోట్లకు పైగా కట్టబెట్టారని మండిపడ్డారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, జగన్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసానికి కాగ్ నివేదికే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ ఐదేళ్లలో రాష్ట్రాన్ని రూ.9.70 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఆ అప్పులకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏటా రూ.71,800 కోట్లు అసలు, వడ్డీల రూపంలో చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన అప్పుల్లో మెజారిటీ వాటా వైసీపీ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. జగన్ చేసిన అప్పులతో ఎటువంటి ఆస్తులు సృష్టించలేదని, కానీ తమ ప్రభుత్వం మూలధన వ్యయం కింద రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తూ భవిష్యత్ తరాలకు ఆస్తులను అందిస్తోందని వివరించారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధిలో తమ ప్రభుత్వం ముందుందని పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బకాయిలు రూ.1600 కోట్లు పెట్టి వెళ్ళిపోతే, తాము 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 20 పారిశ్రామిక పాలసీల ద్వారా రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని, దీనివల్ల 6.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని వెల్లడించారు. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులను నాశనం చేసిన జగన్, ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుని అసత్య ప్రచారాలు చేయడం హాస్యాస్పదమని మంత్రి ఎద్దేవా చేశారు.