ఏపీ రైతులకు ఉగాది కానుక: మార్చి 13న అన్నదాత సుఖీభవ నిధుల విడుదల!

ఆంధ్రప్రదేశ్ రైతులకు ఉగాది పండుగకు ముందు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నిధులను మార్చి 13వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన 22వ విడత నిధులను అదే రోజున విడుదల చేస్తుండటంతో, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులను కలిపి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా ఏపీలోని అర్హులైన రైతులకు ఏడాదికి మొత్తం రూ. 20,000 సాయం అందుతుండగా, ఇప్పటికే రెండు విడతల్లో రూ. 10,000 జమ అయ్యాయి.

మార్చి 13న ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని గౌహతి నుంచి పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. కేంద్రం ఇచ్చే రూ. 2,000 తో పాటు, ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ. 4,000 కలిపి, మొత్తం రూ. 6,000 లను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సంక్రాంతి సమయంలోనే ఈ నిధులు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగింది. ఇప్పుడు ఉగాది పండుగకు ముందే ఈ నగదు అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ‘ఈ-కేవైసీ’ (e-KYC) పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ ఆధారంగా లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులకు నగదు జమ కావడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రైతులు వెంటనే ఈ ప్రక్రియను ముగించి, ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *