కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరిట హైదరాబాద్ లో సృష్టిస్తున్న విధ్వంసాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది ‘మూసీ బ్యూటిఫికేషన్’ కాదని.. అది ‘లూటిఫికేషన్’ అని దుయ్యబట్టారు. నాగోల్ లో ఉన్న ఎస్టీపీని గురువారం పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. తర్వాత నాగోల్ బ్రిడ్జి వద్ద గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన మూసి మోడల్ ని పరిశీలించి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడారు. రూ.16 వేల కోట్లతో మూసీని బాగు చేసే సమగ్రమైన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ బీఆర్ఎస్ హయాంలోనే సిద్ధమైందని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రభుత్వానికి అది అందుబాటులోనే ఉందని పేర్కొన్నారు.
రూ.16 వేల కోట్లతో జరిగే ప్రాజెక్టుని రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మూసీ సుందరీకరణకు తాము మద్దతు ఇస్తామని.. కానీ ఆ ప్రాజెక్టు పేరుతో లక్షల మంది జీవితాలను ఆగం చేస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మంత్రులు, కాంగ్రెస్ నాయకులు.. చెరువులలో ఇళ్లు కట్టుకుని ఉన్నారని అలాంటి వారిని ముట్టుకోకుండా పేదల ఇళ్లు మాత్రం కూలగొడతామని బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి విధ్వంసం, అరాచకం లేకుండానే మూసీని అభివృద్ధి చేయవచ్చని కేటీఆర్ అన్నారు. మూసీ అభివృద్ధి అంశంలో ఒక్క ఇల్లు కూల్చే అవసరం లేనిది బీఆర్ఎస్ మోడల్ అయితే లక్షన్నర ఇండ్లను కూల్చే బుల్డోజర్ మోడల్ కాంగ్రెస్ ది అని ఆరోపించారు. బీఆర్ఎస్ మోడల్ లో వికాసం ఉంటే కాంగ్రెస్ విధానాల్లో విధ్వంసం ఉందన్నారు. మూసి అభివృద్ధి పేరిట కాంగ్రెస్ చేస్తున్న అరాచకాన్ని, అవినీతిని ఆపాలని.. తమ అవినీతి సొమ్ముల కోసం లక్షల మంది పేదల ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం మానుకోవాలని హెచ్చరించారు.
ఎన్నికల ముందు పేదలకు అండగా ఉంటామని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ప్రస్తుతం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఎప్పుడు బుల్డోజర్లు వస్తాయో, ఎప్పుడు తమ ఇళ్లను ప్రభుత్వం కూలగొడుతుందో అని ప్రజలు భయం భయంగా బతుకుతున్నారని అన్నారు. ‘ఇందిరమ్మ రాజ్యం’ తెస్తామని చెప్పి ‘బుల్డోజర్ రాజ్యాన్ని’ తెలంగాణలో తీసుకువచ్చారని ఆరోపించారు.