తేది:26-02-2026 హనుమకొండ TSLAWNEWS పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి దొమ్మటి పవన్ గౌడ్.
వరంగల్ జిల్లా: నేర పరిశోధనలో పోలీస్ జాగిలాల పాత్ర అత్యంత కీలకమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు.మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఎనిమిది నెలల శిక్షణ పూర్తిచేసుకున్న బీగల్ జాతికి చెందిన భైరవ్, విరాట్ జాగిలాలు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నూతనంగా విధుల్లోకి చేరిన సందర్భంగా కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా భైరవ్ హ్యాండ్లర్ కుమార స్వామి, విరాట్ హ్యాండ్లర్ సాంబయ్యలతో మాట్లాడి జాగిలాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. శిక్షణ కాలంలో నిర్వహించిన క్లిష్ట పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిన భైరవ్ జాగిలానికి కమిషనర్ స్వయంగా పతకం అలంకరించి హ్యాండ్లర్లను అభినందించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కొత్తగా చేరిన ఈ జాగిలాలు ప్రేలుడు పదార్థాలను సులభంగా పసిగడతాయని తెలిపారు. చిన్న ఆకారంలో ఉన్నప్పటికీ పెద్ద జాగిలాలు వెళ్లలేని ఇరుకైన ప్రదేశాలు, మార్గాల్లోకి సైతం వీటి ప్రవేశం సాధ్యమవుతుందని చెప్పారు. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణికుల సామాను భద్రపరిచే క్యాబిన్లు, కార్ల క్రింద భాగాలు వంటి ప్రదేశాల్లో ప్రేలుడు పదార్థాలను గుర్తించడం వీటి ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనేక కేసుల దర్యాప్తులో పోలీస్ జాగిలాలు కీలక పాత్ర పోషించాయని, నిందితులను గుర్తించడం, మత్తు పదార్థాలను గుర్తించడం వంటి అంశాల్లో విశేష ఫలితాలు సాధించామని కమిషనర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు శ్రీనివాస్, రవి, ఏసీపీ సురేంద్ర, ఆపరేషన్స్ ఆర్ఐ సింహాచలం శ్రీనివాస్, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అని వారు తెలిపారు.