నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT) రూపొందించిన 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం, సదరు పాఠ్యపుస్తకాన్ని తక్షణమే నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని చేర్చారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. యువత మనసుల్లో న్యాయవ్యవస్థ పట్ల ఉన్న పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను ఎంతమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు.
ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలియజేశారు. వివాదాస్పద పాఠ్యాంశాన్ని తాము సమర్థించడం లేదని, ఇప్పటికే దానిని తొలగించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, ప్రధాన న్యాయమూర్తి ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ.. న్యాయస్థానాల విశిష్ట చరిత్రను విస్మరించి, కేవలం వ్యతిరేక అంశాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చడం వెనుక ఉన్న ఉద్దేశంపై అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను పాఠంలో ఉటంకించడం ద్వారా వ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించారని కోర్టు భావించింది.
ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. NCERT డైరెక్టర్‌తో పాటు పాఠశాల విద్యా శాఖ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ, వివరణ ఇవ్వాలని కోరింది. న్యాయవ్యవస్థకు జవాబుదారీతనం వచ్చే వరకు ఈ విషయాన్ని వదిలిపెట్టబోమని, దీని వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించాలని ఉద్ఘాటించింది. ప్రభుత్వం బహిరంగ ప్రకటన ద్వారా క్షమాపణలు చెబుతామని అంగీకరించడంతో, తదుపరి విచారణను మార్చి 11వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.