శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రబలి ప్రజలు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 20 నెలల కూటమి పాలనలో ప్రజారోగ్యం పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. జిల్లాలో అతిసారతో నలుగురు చనిపోతే, ప్రభుత్వం కేవలం ఒకరు లేదా ఇద్దరే చనిపోయారని అబద్ధపు లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు.
వైద్యం కోసం ప్రజలు ఆసుపత్రుల పాలై అల్లాడుతుంటే, సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి పోస్టుమార్టం నివేదికల పేరుతో కాలయాపన చేయడం దారుణమని ధర్మాన పేర్కొన్నారు. “మంచి ప్రభుత్వం” అని స్టిక్కర్లు వేసుకోవడంపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంలో లేదని ఆయన ఎద్దేవా చేశారు. గత డిసెంబర్లో బలగ ప్రాంతంలో డయేరియా విజృంభించినా ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదని, ఇప్పుడు మళ్ళీ 100 మందికి పైగా రోగులు ఆసుపత్రుల్లో చేరడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
ప్రైవేటీకరణ పేరుతో గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను పక్కన పెట్టారని, నిధులన్నీ రాజధాని పేరుతో ఒకే చోట కుమ్మరిస్తూ జిల్లాల అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. సాగుకు యూరియా అందక రైతులు, ఇంగ్లీష్ మీడియం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం అభివృద్ధిని విస్మరించిన ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ధర్మాన హెచ్చరించారు.